Election Commission
Election Commission | 474 పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఎన్నికల సంఘం.. ఎందుకో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | దేశంలో పార్టీల ప్రక్షాళనకు ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటున్న పార్టీల గుర్తింపు రద్దు చేస్తోంది.

ఈసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు, గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి కారణాలతో మరో 474 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి శుక్రవారం తొలగించింది. తొలి విడతలో భాగంగా ఆగస్టు 9న ఎన్నికల సంఘం 334 పార్టీలను రద్దు చేసింది. ఇందులో తెలంగాణ(Telangana)కు చెందిన 13, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​కు చెందిన 5 పార్టీలు ఉన్నాయి. అనంతరం మరో 476 పార్టీలను రద్దు చేయడానికి ఆగస్టు 11న నోటీసులు ఇచ్చింది. తాజాగా అందులో 474 పార్టీల గుర్తింపు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Election Commission | మొత్తం 808 పార్టీలు

ఇప్పటి వరకు ఈసీ (Election Commission) రెండు దశల్లో 808 పార్టీల గుర్తింపును రద్దు చేసింది. తాజాగా రద్దు చేసిన వాటిలో తెలంగాణకు చెందిన 19 రాజకీయ పార్టీలు ఉన్నాయి. రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసుకుని ఏ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. పోటీ చేసినా తగినన్ని ఓట్లు సాధించకపోవడం, సరైన పత్రాలు ఈసీకి సమర్పించకపోవడం వంటి కారణాలతో రద్దు చేశామని వెల్లడించింది.

ఇప్పటి వరకు దేశంలో 2,520 రిజిస్టర్డ్​ పార్టీలు ఉండగా తాజా తొలగింపుతో వాటి సంఖ్య 2,046కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఆరు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29సీ, ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తుల ఆర్డర్‌ 1968 కింద జాబితా నుంచి తొలగించిన పార్టీలు ప్రయోజనాలు పొందలేవని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.