అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే పలు గ్రామాల్లో హోరాహోరీగా పోరు జరగడంతో సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch Candidates) భారీగా ఖర్చు చేశారు. అయితే తీరా ఓడిపోవడంతో వారు మనోవేదనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు ఫలితాలు ప్రకటించారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకోగా.. ఓడిన వారు మనోవేదనకు గురి అయ్యారు. అయితే భారీగా ఖర్చు పెట్టిన పలువురు ఓడిపోవడంతో ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేస్తున్నారు.
Panchayat Elections | పురుగు మందు డబ్బాతో..
నల్గొండ జిల్లా (Nalgonda District) నార్కట్పల్లి మండలం ఔరావాణి గ్రామంలో BRS పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోయారు. దీంతో ఆయన దేవుని ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని తన భార్యతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా ఈ ఎన్నికల్లో బాలరాజుపై కాంగ్రెస్ మద్దతుదారుడు జక్కలి పరమేశ్ 448 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. దీంతో తాను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.
Panchayat Elections | మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత ఊరైన సోమ్లాతండా (Somlathanda)లో ఆయన వదిన కౌసల్య కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత ఎన్నికల్లో 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఓడిపోయిన భుక్యా కౌసల్య, ఆమె భర్త ధల్సింగ్, కొడుకు సందీప్ శుక్రవారం సేవాలాల్ జెండాతో తండాలో ఇంటింటికి తిరిగారు. ఎన్నికల ముందు తాము ఓటుకు రూ.1,500 పంచామని చెప్పారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి తమకు ఓటు వేసినట్లు సేవాలాల్ జెండాపై ఒట్టు వేయాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో తండావాసులు వారితో వాగ్వాదం చేశారు.