అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Diwali Bonus | దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా దేశంలోని పలు సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించాయి. అయితే ఓ కంపెనీ తన సిబ్బందికి తక్కువ మొత్తం బోనస్ చెల్లించడంతో వారు నిరసన చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫతేహాబాద్ దగ్గర టోల్‌ప్లాజా (Toll Plaza) ఉంది. దీనిని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. టోల్‌ప్లాజాలో 21 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే సదరు కంపెనీ దీపావళి సందర్భంగా వారికి బోనస్ (Diwali Bonus) ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున చెల్లిస్తామని చెప్పింది. కంపెనీ ప్రకటనలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1100కు ఏమి వస్తుందని వారు ఆవేదన చెందారు. అనంతరం నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
Diwali Bonus | పండుగ చేసుకున్న వాహనదారులు
ఆగ్రా– లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తక్కువ మొత్తంలో బోనస్ ఇచ్చిన కంపెనీకి షాక్ ఇవ్వాలని సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దీపావళి పండుగ సందర్భంగా సోమవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అంతేగాకుండా టోల్ గేట్ల (Toll Gates) వద్ద బారికేడ్లను తొలగించి, వాహనాలు టోల్ ఫీజు (Toll Fee) కట్టకున్నా.. వెళ్లేలా చేశారు. దీంతో వాహనాదారులు పండుగ చేసుకున్నారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారు టోల్ కట్టకుండానే వెళ్లిపోయారు.
Diwali Bonus | దెబ్బకు దిగొచ్చిన కంపెనీ
ఉద్యోగుల నిరసనతో కంపెనీ యాజమాన్యం షాక్ అయింది. వారితో చర్చలు జరిపి బోనస్ పెంచుతామని హామీ ఇచ్చింది. వెంటనే విధుల్లో చేరాలని కోరింది. దీంతో నాలుగు గంటల నిరసన అనంతరం ఉద్యోగులు విధుల్లో చేరారు. అయితే ఈ నాలుగు గంటల వ్యవధిలో వేలాది వాహనాలు టోల్ గేట్ దగ్గర ఫ్రీగా వెళ్లిపోయాయి. ఫాస్టాగ్ (FASTag) ఉన్నప్పటికి వాహనం నెమ్మదిగా వెళ్తేనే స్కాన్ అయి డబ్బులు కట్ అవుతాయి. అయితే సిబ్బంది టోల్గేట్ల వద్ద బారికేడ్లను తొలగించడంతో వాహనదారులు వేగంగా దూసుకు పోయారు. దీంతో ఫాస్టాగ్ ద్వారా అమౌంట్ కట్ అయ్యే అవకాశం లేదు.
Diwali Bonus | భారీగా నష్టం
టోల్గేట్ వద్ద 21 మంది పని చేస్తున్నారు. వారికి గతేడాది దీపావళికి రూ.5 వేల బోనస్ ఇచ్చారు. ఈ సారి అంతకంటే ఎక్కువ ఇస్తారని వారు భావించారు. అయితే కంపెనీ రూ.1100మాత్రమే ఇవ్వడంతో వారు షాక్ అయ్యారు. దీంతో వారు చేపట్టిన ఆందోళనతో కంపెనీకి భారీగా నష్టం వచ్చింది. ఉద్యోగులు డిమాండ్ చేసిన బోనస్ కంటే.. చాలా ఎక్కువ నష్టం వచ్చిందిన కంపెనీ తెలిపింది.