అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Ex Mla Jeevanreddy | పొంతనలేని మాటలతో రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) ఢిల్లీలో (Delhi) తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కపట ఎత్తుగడలతో సీఎం రేవంత్‌రెడ్డి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
గత ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) ఓటమి కేసీఆర్‌కు (KCR) పెద్దశిక్ష అని, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో (Erravelli Farmhouse) స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని.. ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా పెద్దశిక్ష అవుతుందో రేవంత్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవుతోందని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ఇందిరా గాంధీతో (Indira Gandhi) పాటు అమేథీ, రాయబరేలీ స్థానాల్లో రాహుల్, కొడంగల్‌లో రేవంత్ కూడా ఓడిపోయారని జీవన్‌రెడ్డి గుర్తు చేస్తూ వారి ఓటమిలు కూడా కాంగ్రెస్‌కు పడిన పెద్దశిక్షలేనా అని నిలదీశారు.
ఎప్పటికీ గెలవలేని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మరణశిక్ష పడినట్లు భావించాలా.. అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రిజనరీ అని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు, తొలి సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ నేత అని ఆయన అభివర్ణించారు.