అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | చలికాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు(Temperature) పడిపోయాయి. పగటి పూట ఎండ బాగానే వస్తున్నా రాత్రి పూట చలి పెరిగింది. ఉదయం 8 గంటల వరకు కూడా చలిగా ఉంటుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. పొగ మంచు కురుస్తుండటంతో తెల్లవారుజామున వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు.
చలికాలం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అయింది. ఈ సీజన్లో హైదరాబాద్(Hyderabad) నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో రికార్డు స్థాయిలో ఉదయం పూట 18.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. బీహెచ్ఈఎల్లో 19.8 డిగ్రీలకు పడిపోయింది. వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం ఉదయం 17 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు ఉదయం ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Weather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో సాయంత్రం, రాత్రి పూట జల్లులు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.
Weather Updates | ఆ రోజు నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో మూడు రోజులుగా వరుణుడు శాంతించాడు. అక్కడక్కడ జల్లులు తప్పా పెద్దగా వానలు పడటం లేదు. అయితే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.