అక్షరటుడే, వెబ్‌డెస్క్ : WEF 2026 | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని బృందం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సమావేశాలు నిర్వహించాలని కోరింది.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ 2026 సదస్సు సందర్భంగా తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్, స్ట్రాటజిక్ ఇంపాక్ట్ అండ్ ఇంటిగ్రేషన్, సి4ఐఆర్ నెట్వర్క్ హెడ్ మంజు జార్జ్‌లను కలిశారు. జూలై లేదా ఆగస్టు నెలలో వార్షిక ఫాలో-అప్ డబ్ల్యూఈఎఫ్ సదస్సును హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణ అందించగల అద్భుతమైన అవకాశాలను, వనరులను ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నట్లు సీఎం తెలిపారు. కాగా సీఎం ప్రతిపాదనకు డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. దీనిపై భవిష్యత్‌లో ముందుకు వెళ్తామన్నారు. ‘సమ్మర్ దావోస్’ ఏటా చైనాలో జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా తమ దేశంలో సదస్సు పెట్టాలని కోరుతున్నట్లు పేర్కొంది.
WEF 2026 | తెలంగాణ రైజింగ్ రోడ్‌మ్యాప్
ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతను, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యాన్ని చేరుకోవడానికి అమలు చేస్తున్న రోడ్‌మ్యాప్ వ్యూహాన్ని వివరించారు. బయోఏషియా 2024 సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన సి4ఐఆర్ తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) ప్రస్థానంపై చర్చించారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) దార్శనికతలో భాగస్వామ్యం వహించాలని తాము కోరుకుంటున్నట్లు జోర్గెన్స్ తెలిపారు. పారిశ్రామిక క్లస్టర్ల ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై సీ4ఐఆర్ చేస్తున్న పరిశోధనల గురించి డబ్ల్యూఈఎఫ్ ఎండీ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.