అక్షరటుడే, ఇందూరు: Chada Venkata Reddy | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ.. పేదలను మోసం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు (CPI National Executive Members), మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) అన్నారు. నగరంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో శనివారం సీపీఐ జిల్లా 22వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జిల్లా మహాసభలు దోహదపడతాయన్నారు.
Chada Venkata Reddy | మార్క్సిజం సిద్ధాంతాల పునాదుల మీదే..
మార్క్సిజం సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడిందే సీపీఐ పార్టీ అని చాడా తెలిపారు. ఆనాడు దేశంలో 500 సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పోరాడిన ఏకైక పార్టీ అని గుర్తుచేశారు. యంత్రాలు లేని సమాజం రావాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని సీపీఐ పోరాటం చేస్తోందన్నారు. దోపిడీకి గురయ్యే వర్గానికి వెన్నుదన్నుగా నిలిచేది కమ్యూనిస్టు పార్టీయేనన్నారు.
Chada Venkata Reddy | కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోంది..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని వెంకట్ రెడ్డి విమర్శించారు. దుర్మార్గులకు కొమ్ముకాసే ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే అందరూ ఒకటవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల హక్కులను సాధించిన ఘనత సీపీఐ అనుబంధ సంఘాలు ఏఐటీయూసీ (AITUC), రైతు సంఘాలు, మహిళా, విద్యార్థి, సంఘాలకే చెల్లుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన బాగానే ఉన్నట్లు అనిపించినా.. పేదల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
Chada Venkata Reddy | ఆపరేషన్ కగార్ నిలిపేయాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిలిపివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చాడ హెచ్చరించారు. 2026లోపు మావోయిస్టులను (Maoists) అంతం చేస్తామనడం సరికాదన్నారు. మావోయిస్టులను చంపగలరు కానీ.. సిద్ధాంతాలను ఎన్కౌంటర్ చేయలేరని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పద్మ, జిల్లా కార్యదర్శి సుధాకర్, ఓమయ్య, రాజేశ్వర్, రాజన్న, విఠల్ గౌడ్, సాయిలు, స్వరూప, రాణి, రఘురాం నాయక్, అంజలి, దేవేందర్, అనిల్, కవితా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.