అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Second-Hand Cars | రాష్ట్రంలో ఇటీవల కొందరు తక్కువ ధరకు వస్తువులు అంటూ సోషల్ మీడియా (Social Media)లో వీడియోలు పెడుతున్నారు. తాము ఫేమస్ కావడానికి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక ప్రజలను మోసం చేస్తున్నారు.
పలువురు వ్యాపారులు, దుకాణదారులు తమ మార్కెట్ పెంచుకోవడినికి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వంద రూపాయలకే టీ షర్టు, వెయ్యి రూపాయలకే టీవీ, రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ గతంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొందరు ఏకంగా రూ.26 వేలకే కారు ఇస్తామని ప్రచారం చేశారు. హైదరాబాద్ (Hyderabad) నగర శివార్లలోని మల్లాపూర్ ప్రాంతం (Mallapur Area)లో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ఓ గ్యారేజ్ ఉంది. వాళ్లు రూ.26 వేలకు కారు ఇస్తామని ప్రచారం చేశారు. రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా ఈ ఆఫర్ అని ప్రకటించారు. ముందు వచ్చిన వారికి అవకాశం అని తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో వందలాది మంది గ్యారేజీకి తరలి వచ్చారు.
Second-Hand Cars | గ్యారేజీ ధ్వంసం
గ్యారేజీ వాళ్లు చెప్పిన సమయానికి ప్రజలు భారీగా వచ్చారు. అయితే అక్కడ ఎవరు లేరు. కార్లు సైతం కనిపించలేదు. అనంతరం వ్యాపారి రోషన్ వచ్చి కార్లు లేవని చెప్పాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు గ్యారేజీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో గ్యారేజీలో ఉన్న కార్లను ధ్వంసం చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం వ్యాపారి రోషన్‌పై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.