అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనపై నుంచి కారు కిందకు పడటంతో తెలంగాణ (Telangana)కు చెందిన నలుగురు మృతి చెందారు.
వైద్యం కోసం మహారాష్ట్రకు వెళ్లి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District)కు చెందిన వారుగా గుర్తించారు.
Maharashtra Accident | కారు అదుపు తప్పి..
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ (Kagaznagar) పట్టణానికి చెందిన జాకీర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జాకీర్ కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యం నిమిత్తం మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్లారు. అక్కడ వైద్యం చేయించుకొని తిరుగు పయనం అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వీరు ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో దేవాడ సమీపంలో వీరి కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను సల్మా బేగం, శబ్రీమ్, ఆఫ్జా బేగం, సహారగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో కాగజ్ నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.