HomeతెలంగాణJubilee Hills by Election | కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్న ఉప ఎన్నిక‌.. కొలిక్కిరాని జూబ్లీహిల్స్...

Jubilee Hills by Election | కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్న ఉప ఎన్నిక‌.. కొలిక్కిరాని జూబ్లీహిల్స్ అభ్య‌ర్థి ఎంపిక‌

Jubilee Hills By-Election | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్​ మల్లగుల్లాలు పడుతోంది. చాలా మంది టికెట్​ ఆశిస్తుండటంతో పలువురి పేర్లను ఇన్​ఛార్జి మంత్రులు పీసీసీకి సిఫార్సు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills by Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజ‌యం సాధించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ కాంగ్రెస్ పార్టీకి అభ్య‌ర్థుల‌ ఎంపిక స‌వాల్‌గా మారింది. అధికార పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ త‌రుణంలో ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌నే దానిపై త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతోంది.

సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు ప‌లువురు యువ నాయ‌కులు సైతం ఉత్సాహంగా ఉండ‌డంతో టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు, మాజీ ఎంపీ, సీనియర్ బీసీ నాయ‌కుడు అంజ‌న్‌కుమార్ యాద‌వ్(Anjan Kumar Yadav) త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టు ప‌బుతుండ‌డం పీసీసీకి త‌ల‌నొప్పిగా మారింది. ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఐదారుగురు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి అవకాశం క‌ల్పిస్తార‌నే దానిపై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఎవ‌రో ఒక‌రికి క‌ల్పిస్తే మిగ‌తా వారు మిన్న‌కుండి పోతారా? రెబ‌ల్‌గా బ‌రిలోకిది దిగుతారా? అన్నది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

Jubilee Hills by Election | బీసీకే అవ‌కాశం..

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆమేర‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఇటీవ‌ల ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అది అక్క‌డే పెండింగ్‌లో ఉండ‌డంతో మంత్రిమండ‌లిలో ఆమోదించి 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ జీవో జారీ చేసింది. మ‌రోవైపు, జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా బీసీ అభ్య‌ర్థికి ఇవ్వాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. దివంగ‌త ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) అనివార్యమైంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌లో గులాబీ పార్టీ గోపినాథ్ స‌తీమ‌ణికే టికెట్ కేటాయించింది. మ‌రోవైపు అధికార పార్టీ బీసీ నాయ‌కుడిని బ‌రిలోకి దింపేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

Jubilee Hills by Election | ప‌ట్ట‌బ‌డుతున్న అంజ‌న్‌

జూబ్లీహిల్స్ టికెట్ కోసం మాజీ ఎంపీ, బీసీ నాయ‌కుడు అంజ‌న్‌కుమార్ యాద‌వ్ టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ మేర‌కు హైక‌మాండ్ వ‌ద్ద తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో టికెట్ త‌న‌కు రాకుండా చేస్తున్న కొంద‌రు మంత్రుల తీరుపై బ‌హిరంగంగానే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానికుల‌కే టికెట్ అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అంజ‌న్ ఇటీవ‌ల ఫైర్ అయ్యారు. అలా చెప్ప‌డానికి ఆయ‌న‌కేమీ అధికారం ఉంద‌ని ప్ర‌శ్నించారు. తాను పారాచూట్ నేత‌ను కాద‌ని, మొద‌టి నుంచి కాంగ్రెస్ కోసం ప‌ని చేస్తున్నాన‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన త‌న‌కంటే సీనియ‌ర్ నాయ‌కుడు ఎవ‌రున్నార‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు, మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయ‌ర్‌, బీసీ వ‌ర్గానికి చెందిన‌ బొంతు రామ్మోహ‌న్ కూడా త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. మ‌రో ఇద్ద‌రు, ముగ్గురు సైతం త‌మ‌కే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఒత్తిడి పెంచుతున్నారు.

Jubilee Hills by Election | న‌లుగురి పేర్లు సిఫార‌సు

టికెట్ కోసం తీవ్ర పోటీ నెల‌కొన్న‌ నేప‌థ్యంలోనే అభ్య‌ర్థి ఎంపిక‌పై తాజాగా కీల‌క సమావేశం జ‌రిగింది. ఈ భేటీలో న‌లుగురి పేర్ల‌ను ఇన్‌చార్జి మంత్రులు సిఫార‌సు చేశారు. ఆర్థిక‌, సామాజిక బ‌లాబ‌లాలు ప‌రిశీలించిన త‌ర్వాత ఆ న‌లుగురి పేర్ల‌ను ఫైన‌ల్ చేశారు. మాజీ ఎంపీ అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌, మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, నవీన్‌ యాదవ్‌తో పాటు సీఎన్‌ రెడ్డి పేర్ల‌ను ప్ర‌తిపాదించారు. వీరిలో సర్వేలు, నివేదికల ఆధారంగా ముగ్గురి పేర్ల‌ను పీసీసీ హైక‌మాండ్(PCC High Command) ప‌రిశీల‌న‌కు పంపించ‌నుంది. సీఎన్ రెడ్డి లేదా అంజ‌న్‌కుమార్ యాద‌వ్ పేరును మిన‌హాయించి మిగ‌తా ముగ్గురి పేర్ల‌ను అధినాయ‌క‌త్వానికి పంపించినున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.