అక్షరటుడే, కామారెడ్డి: Minister Seetakka | పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దోమకొండ (Domakonda) మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రేషన్ కార్డుల (ration cards) పంపిణీ, ఇందిరా శక్తి మహిళా సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2014 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేసిందని వివరించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చాకే రేషన్ కార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
Minister Seetakka | ఇందిరమ్మ ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme), రేషన్ కార్డులు మహిళల పేరు మీద ఇస్తున్నామని మంత్రి వివరించారు. మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి బిడ్డల కోసం రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు వడ్డీ భారం పడకుండా రూ. 26వేల కోట్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రూ. కోటి స్త్రీనిధి అందిస్తున్నామని వివరించారు.
Minister Seetakka | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిలిండర్లు ఇస్తున్నారా..?
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ. 500కే సిలిండర్ ఇస్తున్నారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళకు రూ. 10 లక్షల ప్రమాద బీమా కూడా ఇస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకూ చనిపోయిన మహిళల కుటుంబాలకు రూ. 40 కోట్లు ఇచ్చామని.. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నట్లు వివరించారు.
Minister Seetakka | రుణాలు మాఫీ చేస్తున్నాం..
మహిళా సంఘంలో రుణం తీసుకున్న తర్వాత అనుకోని కారణాలతో మహిళా చనిపోతే వెంటనే రూ. 2లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన మహిళకు, 15 ఏళ్లు దాటిన బాలికలకు మహిళా సంఘంలో సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా పేదలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం పంపిణీ చేయడం ఆగకూడదని గతంలోనే చట్టం తీసుకురావడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
Minister Seetakka | పదమూడేళ్ల తర్వాత రేషన్ కార్డులు: షబ్బీర్ అలీ
పదమూడేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లాలో దాదాపు 4వేల పైన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులలో కొత్తగా పిల్లల పేర్ల నమోదు కూడా చేస్తున్నామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయట్లేదని ఒక్క తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతోనే పెట్రోల్ పంపులు, ఉచిత రవాణా సదుపాయం కల్పించామన్నారు. రూ.5 లక్షల ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నామని, ఇళ్ల మంజూరులో చిన్నచిన్న సమస్యలతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం మంత్రి చేతుల మీదుగా అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు (Arogyasri Cards), నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, బ్యాంకు లింకేజీ కింద 45 మహిళా సంఘాలకు మంజూరైన రూ.5 కోట్లు, స్త్రీనిధి రూ. కోటి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్ విక్టర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, అధికారులు పాల్గొన్నారు.