అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | బీఆర్ఎస్ (BRS) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) భాగంగా శుక్రవారం మూసీ పునరుజ్జీవంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. సీఎం ప్రసంగం అనంతరం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి గన్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. స్పీకర్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Harish Rao | స్పీకర్ పక్షపాత వైఖరి
సభలో స్పీకర్ పక్షపతంతో వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆయన వైఖరికి వ్యతిరేకంగా సమావేశాలను బహిష్కరించామన్నారు. సభ నడిపే తీరు అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. సీఎం అసెంబ్లీని బూతులమయం చేశారని మండి పడ్డారు. సభలో మాట్లాడనివ్వకపోతే తాము ఎందుకు రావాలని ప్రశ్నించారు. అసెంబ్లీని సీఎల్పీగా మార్చారన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లుకూలగొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
Harish Rao | రేపు పవర్ పాయింట్ ప్రజంటేషన్
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో శనివారం ఉదయం 10గంటలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తామని హరీశ్‌రావు తెలిపారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి మీద తాము విమర్శలు చేయొద్దని స్పీకర్ అంటున్నారని, ఇంక తాము ఉండి ఎందుకన్నారు. ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డ్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.