అక్షరటుడే, వెబ్‌డెస్క్: Assembly Sessions | అసెంబ్లీ సెషన్స్‌ను బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సభ్యులు బహిష్కరించడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడారు. మూసీ నదిపై చర్చకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు మొత్తం సెషన్‌నే వాకౌట్ చేయడం సరికాదన్నారు.
Assembly Sessions | బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు అన్యాయం
బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని జూపల్లి అన్నారు. కేటాయింపులపై వారు చేసి ఇచ్చిన సంతకాలు, బండారం మొత్తం బయట పడుతుందని.. బీఆర్ఎస్ పలాయన వాదం పాటిస్తోందన్నారు. సెషన్ బాయ్‌కాట్ చేయడమంటే పలాయన వాదమే అవుతుందని వ్యాఖ్యానించారు. వారి అవినీతి బయట పడుతుందని, అన్యాయం ప్రజలకు తెలుస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) అబాండాలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో చర్చకు రావాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు మైకులు కట్ చేశారని, ఎంతో కఠినంగా వ్యవహరించారని అయినా కాంగ్రెస్ సభ్యులు బాయ్‌కాట్ చేయలేదని గుర్తు చేశారు.
Assembly Sessions | బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యే పరిస్థితి
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యే పరిస్థితి వచ్చిందని జూపల్లి (Minister Jupally) వ్యాఖ్యానించారు. పాలమూరు – రంగారెడ్డి పథకం చర్చించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. తోలు తీస్తామని బయట అనడం కాదు.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చి అన్ని విషయాలు బయటపెట్టాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని తాము సరిచేస్తున్నామన్నారు. తప్పించుకోవడానికి అసెంబ్లీలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశారన్నారు. హరీశ్ రావు (Harish Rao) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన మరుసటి రోజే బాధ్యతను విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు.