అక్షరటుడే, వెబ్డెస్క్: BJP President | బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు పార్టీ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాగా అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (Nitin Nabin)పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.
బీహార్ (Bihar)కు చెందిన నితిన్ నబిన్ను బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గత నెలలో నియమించిన విషయం తెలిసిందే. జనవరి 20న జేపీ నడ్డా (JP Nadda) తర్వాత అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించానున్నారు. జనవరి 19న ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తారు. జనవరి 20న అధ్యక్షుడిగా ఆయనను ప్రకటించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్ బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీజేపీ ప్రధాన ఎన్నికల అధికారి కె. లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పేరును ప్రకటిస్తారు. ప్రధాని మోదీ (PM Modi) సమక్షంలో నబిన్ నామినేషన్ వేస్తారు.
BJP President | కీలక బాధ్యతలు
నబిన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఏడాది తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బలోపేతంపై బీజేపీ (BJP) ఫోకస్ చేసింది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడిపై కీలక బాధ్యతలు ఉండనున్నాయి, కాగా ఇటీవల, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను ఎదుర్కోవడానికి పార్టీ సన్నాహాలను సమీక్షించడానికి నితిన్ నబిన్ తమిళనాడు (Tamilnadu)ను సందర్శించారు. అంతకు ముందు అస్సాంలో పర్యటించారు.
BJP President | నితిన్ నబిన్ నేపథ్యం
కాయస్థ కులానికి చెందిన నబిన్, ప్రస్తుత బీజేపీ చీఫ్ నడ్డా స్థానంలో నియమితులవుతారు. పాట్నాలోని బంకిపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీహార్లో పీడబ్ల్యుడీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి నబిన్ కిషోర్ సిన్హా బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. నితిన్ నబిన్ 2010లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన నాయకుడిగా ఎదిగారు. యువమోర్చాతో విస్తృతంగా పనిచేసిన నబిన్ పలు బాధ్యతల్లో చురుగ్గా పని చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల సమయంలో ఆయన ఇన్ఛార్జిగా ఉండగా ఆ రాష్ట్రంలో బీజేపీ భారీ విజయం సాధించింది. ఐదు సార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 14న ఆయనను బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే మంచి రోజులు లేకపోవడంతో బాధ్యతలు చేపట్టడంలో ఆలస్యం అయినట్లు సమాచారం.