అక్షరటుడే, ఇందూరు: BC Reservation Bill | మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామారెడ్డితో (Kamareddy) పాటు ఇందూరు జిల్లాలో అనేక మండలాలు, గ్రామాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయన్నారు. కానీ ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Incharge Minister Seethakka), ఇతర మంత్రులు, నాయకులు కనీసం అటువైపు కన్నెత్తి చూడట్లేదని విమర్శించారు.
కామారెడ్డి పక్కనే ఉన్న సిరికొండ (Sirikonda), ధర్పల్లి (Dharpally), భీమ్‌గల్‌లో (Bheemgal) కనీసం ప్రజలు ఎలా ఉన్నారని కూడా సమీక్షించలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్తున్నారే తప్ప నష్టపరిహారం చెల్లించడం లేదన్నారు. జిల్లా పక్షాన తాము సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని, అయినా పట్టించుకోలేదన్నారు. రూరల్ ఎమ్మెల్యే స్వతహాగా వైద్యుడైనా.. ఒక గ్రామంలో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయించలేదని పేర్కొన్నారు.
BC Reservation Bill | బీసీల పేరుతో మైనారిటీలకు..
బీసీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని దినేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో 12శాతం ఉన్న మైనారిటీలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు పూర్తి 42శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్లలో కన్వర్టెడ్ క్రిస్టియన్లను, ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో రెడ్డిలదే రాజ్యం అన్నారు. కామారెడ్డి సభ వాయిదా పడిందని తెలిసిందని కనీసం ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వరద బాధితులను ఆదుకోవాలన్నారు.
BC Reservation Bill | పీసీసీ అధ్యక్షుడు..
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు రిజర్వేషన్ పరంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదని విమర్శించారు. కేవలం సీనియారిటీ ప్రాతిపదికన రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారన్నారు. ఆయనతో పాటు పనిచేసిన ఎందరో ఉన్నత పదవులను అధిరోహించారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకుడు న్యాలం రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.