అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డిలో విపక్షనాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమార్పేట్ లో ఈనెల 15న జరిగిన ఘటనలో పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. విపక్ష నాయకులు, సోమార్పేట్ (Somarpet) గ్రామస్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బంద్‌కు మద్దతు పలకాలని కోరారు.
Yellareddy | ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలేవి..?
ఈ సందర్భంగా విపక్ష నాయకులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం సోమర్‌పేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) అనంతరం గ్రామ సర్పంచ్ కురుమ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి.. సర్పంచ్‌గా ఓడిపోయిన అభ్యర్థి బిట్ల బాలరాజు కుటుంబ సభ్యులపై దాడి చేశారన్నారు. అకారణంగా ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటనలో కేవలం చిరంజీవి మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి మిగతా వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ట్రాక్టర్ ఘటనకు ప్రేరేపించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు (Congress Party) కురుమ సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Yellareddy | బాధితులకు వైద్యం అందించాలి..
సోమార్పేట్ గ్రామ ఘటనలో హైదరాబాద్‌లోని (Hyderabad) యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులు భరించాలని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Yellareddy | పట్టణంలో భారీ బందోబస్తు
ఎల్లారెడ్డి పట్టణ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు సీఐ రాజారెడ్డి (CI Raja Reddy), ఎస్సై బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.