అక్షరటుడే, వెబ్‌డెస్క్: ISRO | అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయి చేరుకుంది. బాహుబలి రాకెట్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది.
ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) బుధవారం (డిసెంబర్ 24, 2025) ఉదయం బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉదయం 8.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (Satish Dhawan Space Centre)లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM3 నింగిలోకి దూసుకెళ్లింది. 15 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ISRO | అత్యంత బరువైన శాటిలైట్
ఈ మిషన్‌తో ఇస్రో రెండు మైలురాళ్లను సాధించింది. ఇది అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూ దిగువ కక్ష్యలో ప్రవేశ పెట్టింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం భారత్ నుంచి LVM3 ద్వారా ప్రయోగించబడిన అత్యంత బరువైన పేలోడ్ (6,100 కిలోలు)గా నిలిచింది. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ (ISRO Chairman Narayanan) ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు.
ISRO | కమ్యూనికేషన్ ఉపగ్రహం
బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ (AST SpaceMobile) అభివృద్ధి చేసింది. ఇది తదుపరి తరం బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహ శ్రేణిలో భాగం. మొబైల్ స్మార్ట్ఫోన్లకు నేరుగా అంతరిక్ష ఆధారిత సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి దీనిని రూపొందించారు.ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా, అన్ని వేళలా 4G మరియు 5G వాయిస్ మరియు వీడియో కాల్స్, టెక్స్ట్‌లు, స్ట్రీమింగ్ మరియు డేటాను అందిస్తుంది.
ISRO | ప్రధాని అభినందనలు
LVM3 రాకెట్ గతంలో చంద్రయాన్-2, చంద్రయాన్-3 శాటిలైట్లను మోసుకెళ్లింది. 72 ఉపగ్రహాలను తీసుకెళ్లిన రెండు వన్‌వెబ్ మిషన్లను (OneWeb Missions)విజయవంతంగా ప్రయోగించింది. LVM3 చివరి ప్రయోగం LVM3-M5/CMS-03 మిషన్, ఇది నవంబర్ 2, 2025న విజయవంతంగా పూర్తయిందని ఇస్రో తెలిపింది. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేశామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. LVM3-M6 విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.