అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kia Seltos | ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. భారత మార్కెట్లో తన సెకండ్ జనరేషన్ సెల్టోస్‌ను ఆవిష్కరించింది. మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో అత్యాధునిక హంగులతో దీనిని తీసుకొచ్చింది. నేటినుంచి(డిసెంబర్ 11) బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చేనెలలో ధర వివరాలు వెల్లడవనున్నాయి.
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్లను తీసుకువస్తూనే ఉన్నాయి. కియా సైతం తన రెండో జనరేషన్ సెల్టోస్‌ను తీసుకువస్తోంది. స్టైలిష్ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త 2026 మోడల్లో మరిన్ని హైబ్రిడ్ ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది టాటా సియారా(Tata Sierra), హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. జనవరి 2న ధర వెల్లడవనుంది. కాగా గురువారం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 25 వేలతో బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ కారు ఫీచర్లు తెలుసుకుందామా..
Kia Seltos | డిజైన్
పెద్ద ఎస్యూవీ (SUV)ల నుంచి ప్రేరణ పొందిన స్టైల్‌తో, టైగర్ నోజ్ గ్రిల్‌తో నూతన మోడల్‌ను తీసుకొచ్చారు. వర్టికల్ లైటింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్(Alloy wheels) ఉన్నాయి. కనెక్టెడ్ టెయిల్ లైట్లతో కూడిన అప్డేటెడ్ టెయిల్ గేట్‌ను అమర్చారు. ముందు వెనక గన్మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లతో కూడిన బంపర్లున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ (Panoramic Sunroof), ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ ఆంటెన్నా వంటివి ఉన్నాయి. 10 బాడీ పెయింట్ ఆప్షన్లతో తీసుకొచ్చారు. ఇందులో మార్నింగ్ హేజ్, మాగ్మా రెడ్ కొత్తవి. 4,460 మి.మీ. పొడవుతో తీసుకువచ్చిన ఈ మోడల్.. ఈ సెగ్మెంట్లో అత్యంత పొడవైన కారని కంపెనీ ప్రకటించింది. 1,830 మి.మీ. వెడల్పు, 1635 మి.మీ. ఎత్తు, 2690 మి.మీ. వీల్‌బేస్‌తో కొత్త కారు వస్తోంది. గతంతో పోలిస్తే వీల్‌బేస్ 80 మిల్లీమీటర్లు పెరిగింది. వీల్‌బేస్ పెరగడం వల్ల లెగ్‌రూమ్ కూడా ఆ మేర పెరిగింది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల HD టచ్‌స్క్రీన్ సింగిల్ ప్యానెల్ విజువల్ కమాండ్ సెంటర్ ఉన్నాయి.
Kia Seltos | భద్రత పరంగా..
6 ఎయిర్‌బ్యాగులు , ఈఎస్పీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేకులు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఓటీఏ అప్డేట్లతో కూడిన రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, నావిగేషన్ బేస్డ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి లెవల్ 2 అడాస్(ADAS) ఫీచర్లున్నాయి.
Kia Seltos | ఇంజన్ ఆప్షన్స్
1.5 లీటర్ నేచ్రల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 హెచ్‌పీ, 144 ఎన్ఎం), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 హెచ్‌పీ, 253 ఎన్ఎం), 1.5 లీటర్ డీజిల్ (116 హెచ్‌పీ, 250 ఎన్ఎం) ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. ఎంటీ, ఐవీటీ, డీసీటీ, ఏటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో తీసుకొచ్చారు.