Homeతాజావార్తలుConstable pramod | నిందితుడికి సరైన శిక్ష: కానిస్టేబుల్​ ప్రమోద్​ భార్య

Constable pramod | నిందితుడికి సరైన శిక్ష: కానిస్టేబుల్​ ప్రమోద్​ భార్య

తన భర్తను హతమార్చిన నిందితుడికి సరైన శిక్ష పడిందని కానిస్టేబుల్​ ప్రమోద్ భార్య​ ప్రణీత అన్నారు. రౌడీషీటర్​ రియాజ్​ ఎన్​కౌంటర్​పై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Constable pramod | రౌడీషీటర్​ రియాజ్​ను పోలీసులు ఎన్​కౌంటర్​ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హత్యకు గురైన కానిస్టేబుల్​ ప్రమోద్​ భార్య ప్రణీత ఎన్​కౌంటర్​పై స్పందించింది. నిందితుడు రియాజ్​కు​ సరైన శిక్ష పడిందని వ్యాఖ్యానించింది. హత్య జరిగిన రోజు సీసీఎస్​ కార్యాలయం (CCS Office) నుంచి అర్జెంట్​గా రావాలని ఫోన్ కాల్ రావడంతో ఆయన డ్యూటీకి వెళ్లాడని.. తిరిగి మృతదేహంగా ఇంటికి వచ్చాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.

Constable pramod | సంచలనం సృష్టించిన హత్య ఘటన

కానిస్టేబుల్​ ప్రమోద్​ను రౌడీషీటర్​ రియాజ్​ మూడురోజుల క్రితం నిజామాబాద్​ నగరంలో నడిరోడ్డుపై హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రియాజ్ శనివారం సాయంత్రం నగర శివారులోని సారంగపూర్ (Sarangapur)​ ప్రాంతంలో ఉండగా ఓ వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పెనుగులాటలో రియాజ్​కు సైతం గాయాలయ్యాయి.

ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రియాజ్​ను పట్టుకున్నారు. గాయాలైన వ్యక్తిని, అలాగే రియాజ్​ను జీజీహెచ్​కు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జీజీహెచ్​లోని ఓ వార్డులో మళ్లీ పోలీసులపై రియాజ్ దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గన్​ లాక్కునేందుకు యత్నించగా.. ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు కాల్పులో జరగడంతో రియాజ్​ హతమయ్యాడు. ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Constable pramod | తన తండ్రి డ్యూటీకి వెళ్లాడనుకుంటున్నారు..

తన ముగ్గురు కొడుకులను అల్లారుముద్దుగా చూసుకునేవాడని కానిస్టేబుల్​ ప్రమోద్​ సతీమణి ప్రణీత విలపిస్తూ పేర్కొన్నారు. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పటికీ వాళ్ల నాన్న డ్యూటీకి వెళ్లారనే అనుకుంటున్నారని ఆమె విలపించారు.

పెద్దకొడుకు ప్రణీత్​ ఎనిమిదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు ప్రమిత్ ఆరో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల చిన్నకుమారుడు నరేన్ తన తండ్రి డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తాడని వాళ్ల తల్లిని అడుగుతున్న దృశ్యాలు స్థానికులను కన్నీళ్లు పెట్టించాయి.

Constable pramod | దీపావళి పటాకులు తెస్తాడనుకుని..

తన తండ్రి హైదరాబాద్​కు వెళ్లాడని.. వచ్చేటప్పుడు దీపావళి పటాకులు తీసుకొస్తాడని బాబు చెబుతున్న మాటలు స్థానికులను కలిచివేశాయి. దీపావళికి (Diwali) తన తండ్రి ఇంటికి వస్తాడనే భ్రమలోనే చిన్నకొడుకు ఉన్నాడని ఆయన కోసమే ఎదురుచూస్తున్నాడని కానిస్టేబుల్​ భార్య చెబుతుంటే.. చుట్టు పక్కల వాళ్లు కంటతడి పెట్టారు.

Constable pramod | ఎక్స్​గ్రేషియా ప్రకటించినా.. నా భర్త తిరిగి రాలేడు కదా..?

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. ఈ విషయమై ప్రణీత స్పందించింది. కానీ రూ. కోటి ప్రకటించారు కానీ నా భర్తను తిరిగి తీసుకురాలేరు కదా అని వ్యాఖ్యానించారు. మృతిచెందిన ప్రమోద్​ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 300 గజాల ఇంటి స్థలం ఇవ్వడంపై ఆమె డీజీపీ శశిధర్ రెడ్డి (DGP Shashidhar Reddy), సీపీ సాయి చైతన్యలకు (CP Sai Chaitanya) ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడిని ఎన్​కౌంటర్​ చేసి సరైన శిక్ష విధించారని అన్నారు. తన లాంటి పరిస్థితి మరో కుటుంబానికి రావద్దన్నారు.