అక్షరటుడే, వెబ్డెస్క్ : Kurnool Bus Accident | కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద (Kurnool Bus Accident) ఘటన వెనక మిస్టరీ వీడింది. ఘోర దుర్ఘటనకు కారణామేమిటో పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. బైకర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందనే సంచలన విషయం బయటపడింది.
మద్యం తాగి బైక్ పై కర్నూలుకు బయల్దేరిన శిశశంకర్, ఎర్రి స్వామి మధ్యలో డివైడర్ ను ఢీకొని కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న స్నేహితుడ్ని పక్కకు లాగుతున్న క్రమంలో వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri Travels) బస్సు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న బైక్ను ఈడ్చుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఎర్రి స్వామి అక్కడి నుంచి తన సొంతూరికి పారిపోయాడు.
Kurnool Bus Accident | సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తింపు..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూర్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) బైక్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ ఉదంతంపై కర్నూలు పోలీసులు సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందు ఏం జరిగిందని ఆరా తీయగా, వాస్తవాలు బయటపడ్డాయి.
Kurnool Bus Accident | ప్రమాదానికి ముందే యాక్సిడెంట్..
వాస్తవానికి రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతోనే ప్రమాదంతో జరిగిందని అందరూ భావించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో కీలక విషయం వెలుగు చూసింది. బైక్ నడుపుతున్న శివశంకర్ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందాడని అందరూ భావించారు. కానీ, బస్సు ప్రమాదానికి ముందే జరిగిన యాక్సిడెంట్ లో అతడు చనిపోయినట్లు కర్నూలు పోలీసులు (Kurnool Police) వెల్లడించారు. బస్సు దగ్ధమైన కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిశాయి. అగ్ని ప్రమాదానికి ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లిన వీడియో కీలక ఆధారంగా మారింది.. రాత్రి 2:23 గంటలకు శివశంకర్ మరో వ్యక్తితో కలిసి పెట్రోల్ బంక్లోకి (Petrol Bunk) వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో వెళ్లిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న శివశంకర్ ను అతివేగంగా నడపడంతో బండి స్కిడ్ అయింది. అయినప్పటికీ నిబాయించుకుని జాతీయ రహదారి మీదుగా కర్నూలు వైపు బయల్దేరారు. అయితే, చిన్నటేకూర్ సమీపంలోకి రాగానే డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు మీద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రి స్వామి గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ ను పక్కకు లాగేందుకు అతడు ప్రయత్నించాడు. అప్పటికే నడిరోడ్డుపై ఉన్న బైక్‌ను వేగంగా వచ్చిన కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు.
Kurnool Bus Accident | పరారైన ఎర్రి స్వామి
బస్సు మంటల్లో చిక్కుకోవడాన్ని కళ్లారా చూసిన స్వామి భయాందోళనకు గురయ్యాడు. శివశంకర్ ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. పెట్రోల్ బంకులో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ పై ఉన్న రెండో వ్యక్తి స్వామిగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాలు వెలుగుచూశాయి.
