అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Cases | రాష్ట్రంలో ఏసీబీ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. లంచాలు తీసుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటోంది. అవినీతి కేంద్రాలకు మారిన కార్యాలయలపై ఆకస్మిక సోదాలు చేపడుతోంది. రూ.కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన వారి పని పడుతోంది.
అవినీతి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. లంచాలు తీసుకేనే వారి పని పడుతోంది. ఈ ఏడాదిలో ఏకంగా 199 కేసులు నమోదు చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా (ACB Director General Charu Sinha) వార్షిక నివేదికను విడుదల చేశారు.
రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. 2025లో మొత్తం 199 కేసులను నమోదు చేయగా, 273 మంది నిందితులను ఏసీబీ అధికారులు (ACB Officers) అరెస్టు చేశారు. వీటిలో 157 ట్రాప్ కేసులు ఉన్నాయి. లంచం తీసుకుంటుండగా.. 224 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. మిగతా వారు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.
ACB Cases | అవినీతి తిమింగలాల ఆటకట్టు
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్న ఏసీబీ.. పలు శాఖల్లోని పెద్ద పెద్ద అవినీతి తిమింగలాల అక్రమాస్తులను సైతం బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఇటీవల మహబూబ్‌నగర్ (Mahbubnagar) డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషన్ ఇళ్లలో సోదాలు చేసి రూ.వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. ఈ ఏడాది ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులపై అక్రమ ఆస్తులకు సంబంధించిన 15 కేసులు నమోదు చేసింది. నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించిన 26 ఇతర కేసులు పెట్టింది. వీటిలో 34 మంది నిందితులను అరెస్టు చేశారు.
ACB Cases | తనిఖీలతో హడల్
గతంలో ప్రజలు అధికారులు ఫిర్యాదు చేస్తేనే అధికారులను ఏసీబీ పట్టుకునేది. అయితే ఇటీవల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో అవినీతి అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఈ ఏడాది 26 రెగ్యులర్ ఎంక్వైరీలు నిర్వహించింది. వివిధ కార్యాలయాల్లో 54 ఆకస్మిక తనిఖీలు చేసింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు (RTA Check Posts), వివిధ సంక్షేమ హాస్టళ్లలో సైతం తనిఖీలు చేయడం గమనార్హం. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాల్లో ఏసీబీ తనిఖీలు చేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఆర్టీఏ చెక్‌పోస్టులను తనిఖీ చేసి భారీగా అవినీతి జరుగుతున్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం వాటిని మూసివేసిన విషయం తెలిసిందే.
ACB Cases | భారీగా నగదు స్వాధీనం
నిందితులపై విచారణ కోసం ఏసీబీ ప్రభుత్వం నుంచి 115 మంజూరు ఉత్తర్వులను పొంది, చార్జిషీట్లు దాఖలు చేసింది. 2025లో నమోదైన ట్రాప్ కేసు (Trap Case)ల్లో మొత్తం రూ. 57,17,500 నగదు స్వాధీనం చేసుకుంది. అందులో రూ. 35,89,500 ఫిర్యాదుదారులకు తిరిగి చెల్లించింది. 15 కేసుల్లో రూ.96,13,50,554 విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించింది. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుంది.
ACB Cases | సిబ్బందికి శిక్షణ
ఈ ఏడాది ఏసీబీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ, నిందితులు/అనుమానిత అధికారుల ప్రొఫైల్‌ల తయారీ, నిఘా పద్ధతులు, బినామీ ఆస్తుల చట్టం, ఆర్థిక లావాదేవీలను గుర్తించడంపై దర్యాప్తు, ఆర్థిక లావాదేవీల డిజిటల్ పాదముద్రలు, ట్రాప్ & DA కేసులలో చట్టపరమైన స్థానం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.