HomeతెలంగాణKTR | అందుకే ఓడిపోయాం.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

KTR | అందుకే ఓడిపోయాం.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట (Achampet)లో ఆదివారం నిర్వహించిన బీఆర్​ఎస్ (BRS)​ జనగర్జన సభలో ఆయన మాట్లాడారు.

అచ్చంపేట ప్రజలు తమ ఎమ్మెల్యే ఓడిపోతారు కానీ కేసీఆర్​ సీఎం అవుతారని భావించారని కేటీఆర్​ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు అలా అనుకోవడంతోనే తాము ఓడిపోయాని చెప్పారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మళ్లీ వచ్చేది కేసీఆర్​ ప్రభుత్వమేనని కేటీఆర్​ అన్నారు.

KTR | రేవంత్​రెడ్డిలో అపరిచితుడు

రేవంత్​రెడ్డిలో అపరిచితుడు ఉన్నారని కేటీఆర్​ విమర్శించారు. పొద్దున ఓ తీరు సాయంత్రం మరో తీరు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రోజు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్​ జపం చేస్తారన్నారు. కేసీఆర్​ను తిట్టడం తప్ప ఆయన ఏం చేయడం లేదని పేర్కొన్నారు. రేవంత్​రెడ్డి మాట్లాడినంత హీనంగా ఇంతవరకు ఏ సీఎం మాట్లాడలేదన్నారు. సీఎం పుట్టిన అచ్చంపేట నియోజకవర్గం నుంచే బీఆర్​ఎస్​ జనగర్జన యాత్ర ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ నుంచి వెళ్లారని బాధ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకంటే మంచి నాయకుడిని కేసీఆర్ నిలబెడుతారని చెప్పారు. అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు.

KTR | ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపే దమ్ముందా..

ఆల్మట్టి డ్యామ్ (Almatti Dam)​ ఎత్తు పెంచడానికి కర్ణాటక (Karnataka) ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎత్తు పెంచితే తెలంగాణకు కృష్ణానది (Krishna River)కి చుక్కా నీరు రావని ఆయన పేర్కొన్నారు. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్​రెడ్డి పాలమూరు ఎండిపోయే పరిస్థితి వచ్చినా పిల్లిలా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం కృష్ణా జలాలను ఆపే ప్రయత్నం చేస్తుంటే.. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆల్మట్టిని ఆపే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా లేదా అని కేటీఆర్​ ప్రశ్నించారు. రాహుల్​గాంధీ (Rahul Gandhi)తో చర్చించి కర్ణాటక సీఎంను ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఒప్పించాలన్నారు. లేదంటే బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

KTR | బోనస్​.. బోగస్​ అయింది

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్​ విమర్శించారు. కాంగ్రెస్​ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీ కార్డులు పంచిందన్నారు. ఈ రోజు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలకు పడ్డా బాకీల కార్డులను తాము ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్​ను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. దీంతో ఇప్పుడు గోస పడుతున్నారని చెప్పారు. యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. వరికి బోనస్ బోగస్​ అయిందని కేటీఆర్​ అన్నారు. బోనస్​ ఇస్తామని చెప్పి ఖాతాల్లో జమ చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్​ హయాంలో 90శాతం పూర్తయిందన్నారు. పది శాతం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్​ను రేవంత్​రెడ్డి పక్కన పెట్టారని విమర్శించారు. మాట తప్పిన ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలను కోరారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్​ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మాజీ మంత్రులు నిరంజన్​రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News