HomeతెలంగాణKaleshwaram Project | అందుకే మేడిగడ్డ కూలింది.. మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kaleshwaram Project | అందుకే మేడిగడ్డ కూలింది.. మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ నివేదికపై అసెంబ్లీలో చర్చ సాగుతోంది. ఈమేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదివారం సాయంత్రం చర్చను ప్రారంభించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపారు. విరామం అనంతరం సాయంత్రం సభ ప్రారంభం కాగా.. ప్రభుత్వం కాళేశ్వరంపై చర్చను లేవనెత్తింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్​ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మించి డ్యామ్​ల వాడుకోవాలని చూశారన్నారు. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడంతోనే మేడిగడ్డ కూలిందని ఆయన తెలిపారు. అధికారులు హెచ్చరించినా నీటి నిల్వ తగ్గించలేదన్నారు.

Kaleshwaram Project | 125 టీఎంసీలే ఎత్తిపోశారు..

తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను మొదలు పెట్టారని మంత్రి తెలిపారు. రూ.87,449 కోట్లతో ప్రాజెక్ట్​ నిర్మించారన్నారు. ఇందులో రూ.24 వేలు కోట్లు పెట్టి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. 20 నెలలుగా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఏడాదికి 195 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పారన్నారు. కానీ.. ఐదేళ్లలో కేవలం 125 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారన్నారు. అందులో నుంచి మళ్లీ కొన్ని టీఎంసీలు సముద్రంలోకి వదిలేశారని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​తో వాడుకున్నది 101 టీఎంసీలేనని ఆయన తెలిపారు.

Kaleshwaram Project | ముందే నిర్ణయించారు..

వాప్కోస్​ రిపోర్ట్​ (WAPCOS Report) రాకముందే బీఆర్​ఎస్ (BRS)​ ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించిందని ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. రిపోర్ట్​ వచ్చిన రోజే మేడిగడ్డ నిర్మాణానికి ఆదేశించిందని పేర్కొన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్​ గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. ఇంద పెద్ద ప్రాజెక్ట్​తో రాష్ట్రంలో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా పెరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదంగా ఆయన అభివర్ణించారు.

Kaleshwaram Project | ప్రణాళిక లేకుండా..

కాళేశ్వరం డిజైన్​, నిర్మాణం, నాణ్యతలో లోపాలు ఉన్నట్లు జస్టిస్​ పీసీ ఘోష్ (PC Gosh)​ కమిషన్​ తెలిపిందని మంత్రి అన్నారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టినట్లు కమిషన్​ పేర్కొందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్​ను వినియోగించకున్నా.. రికార్డు స్థాయిలో పంటలు పండాయని ఆయన గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో కట్టిన ప్రాజెక్ట్​ వారి హయాంలోనే కూలిందన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎన్​డీఎస్​ఏ నివేదిక ఆధారంగా బ్యారేజీలో నీరు నిల్వ చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2013 నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ప్రారంభించిందన్నారు. 2014 వరకు ఈ ప్రాజెక్ట్​ కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. రూ.38,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తయ్యేదని, కానీ కేసీఆర్​ డిజైన్​ మార్చి కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు.