అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jaggareddy | తాను కాంగ్రెస్‌లో చేరడానికి గల కారణాలను మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) వెల్లడించారు. ఆదివారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై (Kalvakuntla Kavitha) జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి హరీశ్‌రావు కారణం కాదని తెలిపారు. కాగా.. హరీశ్‌రావుపై కోపంతోనే జగ్గారెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారని కవిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. హరీశ్‌రావు, కేసీఆర్‌పై కోపంతో తాను పార్టీ మారలేదని చెప్పారు. నాడు వైఎస్సార్ పిలవడంతో కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇవ్వడంతో పార్టీ మారానన్నారు. తన విషయంలో కవిత రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారని మండిపడ్డారు.
Jaggareddy | కేసీఆర్ కుమార్తె కావడంతోనే..
రాజకీయంగా హరీశ్ రావు (Harish Rao) తనకు ప్రత్యర్తి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారని చెప్పారు. తమ జిల్లాలో బాగారెడ్డి, రామచంద్రారెడ్డి వంటి గొప్ప నాయకులు ఉండేవారని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని తాను వచ్చినట్లు తెలిపారు. కాగా.. జగ్గారెడ్డి మొదట తన రాజకీయ జీవితాన్ని బీజేపీ నుంచి ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2009, 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2014, 2023లో ఓడిపోయారు.
Jaggareddy | డిస్టర్బ్ అయ్యాను
తాను డైరెక్ట్ రాజకీయాలు చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. హరీష్ రావు వెనక నుంచి పొడుస్తారని ఆరోపించారు. తాను కొంచెం డిస్టర్బ్ అయ్యానని చెప్పారు. అయితే ఎందుకు డిస్టర్బ్ అయ్యానో, దానికి కారణం ఎవరో తర్వాత చెబుతానన్నారు. తాను ఏదైనా విషయంలో డిసైడ్ అయితే వెనక్కి రానని స్పష్టం చేశారు.