అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Justice Gavai | సుప్రీంకోర్టులో తనపై జరిగిన షూ దాడిపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ గురువారం మరోసారి స్పందించారు. అది ముగిసిపోయిన అధ్యయమని వ్యాఖ్యానించారు. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Justice Gavai) బూట్‌తో దాడి చేసిన ఘటనపై తన వైఖరిని పునరుద్ఘాటించారు.
ఇది మరిచిపోయిన అధ్యాయం అని అన్నారు. “సోమవారం జరిగిన దానితో నేను, నా సహచర న్యాయమూర్తి చాలా షాక్ అయ్యాము. అయితే, మాకు ఇది మరిచిపోయిన అధ్యాయమని” వ్యాఖ్యానించారు. హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలోనే దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు గురువారం స్పందించారు. కోర్టులో సంయమనం పాటించాలని, “తక్కువగా మాట్లాడాలని” న్యాయమూర్తులకు హితవు పలికారు.
Justice Gavai | బార్ సభ్యత్వం రద్దు..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఓ కేసును విచారిస్తున్న సమయంలో 71 ఏళ్ల న్యాయవాది రాకేశ్ కిషోర్ తన కాలికి ఉన్న షూ తీసి చీఫ్ జస్టిస్పైకి విసిరేశారు. హిందూ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ వైపు బూటు విసిరారు. అయితే అది ఆయనకు తగలలేదు. కాసేపు షాక్‌కు గురైన సీజేఐ గవాయ్.. ఆ తర్వాత తేరుకుని కేసుల విచారణను కొనసాగించారు. ఇలాంటివి తమ దృష్టిని మళ్లించలేవన్న ఆయన.. నిందితుడిపై ఎలాంటి కేసు పెట్టబోనని తెలిపారు. “వీటన్నిటితో పరధ్యానం చెందకండి. మేము పరధ్యానంలో లేము. ఈ విషయాలు నన్ను ప్రభావితం చేయవు” అని జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కలిసి బెంచ్‌లో కూర్చున్న గవాయ్.. కేసుల విచారణను కొనసాగించారు.
మరోవైపు, చీఫ్ జస్టిస్ గవాయ్‌పైకి దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్ కిషోర్ సభ్యత్వాన్ని బార్ రద్దు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులోని తన కోర్టు గదిలో భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై రాకేశ్ షూ విసిరేందుకు ప్రయత్నించాడని దిగ్భ్రాంతికరమైన సమాచారం అందింది. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council of India) ఆయన లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తిపై తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నిర్ధారించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది రాకేష్ కిషోర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది.