అక్షరటుడే, వెబ్డెస్క్: Cloud Burst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదలు తీవ్ర విషాదానికి దారితీశాయి. ఈ వరదల్లో ధరాలీ (Dharali) అనే గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రాథమికంగా ఇది ఖీర్‌గంగా నదిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా జరిగిందని భావించినా, తాజా సమాచారం ప్రకారం ఇది క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కాదనే అనుమానాలు ఊపందుకుంటున్నాయి.
ఇండియన్ మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ప్రకారం ఉత్తరకాశీలో కేవలం 27 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది క్లౌడ్ బరస్ట్‌గా పరిగణించదగిన స్థాయి కాదు. ఒక గంటలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడితేనే క్లౌడ్ బరస్ట్ అని అర్థం చేసుకోవాలని ఐఎండీ శాస్త్రవేత్త రోహిత్ తప్లియాల్(IMD Scientist Rohit Tapliyal) స్పష్టం చేశారు.
Cloud Burst | అనుమానాలు..
అంత తక్కువ వర్షంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేకపోయామని తెలిపారు. ఈ పరిస్థితులపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వరదల వెనుక ఉన్న మరో కారణంగా బురద ప్రవాహాలు, మంచు కరుగుదల, మరియు నదీ ప్రవాహ మార్గాల ఆకృతి అంశాలను ప్రస్తావించారు వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ శాస్త్రవేత్త డీపీ డోబాల్ (Former scientist DP Doval). ఎత్తయిన ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కలిసి నీటిలోకి చేరినప్పుడు కూడా ఒక్కసారిగా భారీ వరదలు రావచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రావాలంటే శాటిలైట్ ఫోటోలు (Satellite Photos), వీడియో విశ్లేషణ అవసరం అని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఇస్రో ISRO సహాయం కోరామని వెల్లడించారు.
ధరాలీ గ్రామంలో వరదల ధాటికి ఇళ్లు, హోటళ్లు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 11 మంది సైనికులతో సహా పలువురు గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేవలం రెండు మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. చాలా మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ వరదలు నిజంగా క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగాయా? లేక మంచు కరిగే ప్రక్రియ, భూపరివర్తనల కారణమా? అనే ప్రశ్నలకు ఇంకా ఖచ్చితమైన సమాధానం రాలేదు. నిపుణులు, శాస్త్రవేత్తలు సమగ్ర అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఉత్తరాఖండ్ వరదలు (Uttarakhand Floods) మరొకసారి ప్రకృతి విషయంలో మనం తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలను గుర్తు చేశాయి.