అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tesla Cars | ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ (Elon Musk) టెస్లా కార్లకు భారత్‌లో గిరాకీ కరువైంది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌లో తన తొలి షోరూమ్‌ను జులైలో ప్రారంభించింది. అయితే భారీ రేట్లు ఉండే ఈ కార్లకు దేశంలో డిమాండ్ లేదు. ఇప్పటి వరకు టెస్లా 104 కార్లను మాత్రమే విక్రయించింది.
దేశంలో ఇటీవల ఆటో మొబైల్ రంగం (automobile sector) జోరందుకుంది. కార్ల కొనుగోళ్లు పెరిగాయి. కేంద్రం జీఎస్టీ సంస్కరణలు అమలు చేశాక మధ్య తరగతి ప్రజలు సైతం కార్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లపై (Tesla cars) భారతీయులు ఆసక్తి చూపడం లేదు.
Tesla Cars | అక్టోబర్‌లో 40 కార్లే..
టెస్లా దేశంలో అక్టోబర్‌లో 40 కార్లను విక్రయించింది, దీనితో మొత్తం అమ్మకాలు 104 యూనిట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో 64 యూనిట్లను డెలివరీ చేసింది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (American electric vehicle) (EV) తయారీదారు ప్రస్తుతం భారతదేశంలో Y SUV మోడల్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. పరిశ్రమ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో 18,055 ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జరిగాయి. ఇందులో టెస్లా కార్లు 40 మాత్రమే ఉండటం గమనార్హం.
Tesla Cars | రెండు షోరూమ్‌లు
దేశంలో టెస్లాకు ప్రస్తుతం రెండు షో రూమ్‌లు ఉన్నాయి. ఒకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో ఉంది. అయితే దేశ ఈవీ రంగంలో టెస్లా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈవీ కార్ల అమ్మకాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 17.78 శాతం వృద్ధి నమోదు అయింది. అయితే టెస్లాకు మాత్రం ఆదరణ కరువైంది. వీటి ధరలు అధికంగా ఉండటంతోనే కొనుగోళ్లు జరగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం టెస్లా భారత్‌లో రెండు వేరియంట్లలో కార్లను అమ్ముతోంది. ప్రామాణిక RWD ధర రూ.59.89 లక్షలు, లాంగ్ రేంజ్ RWD వేరియంట్ ధర ₹67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
