అక్షరటుడే, హైదరాబాద్: Terrorist conspiracy : హైదరాబాద్(Hyderabad)లో ఉగ్రవాదుల భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసులు భగ్నం చేశారు. భారీ విధ్వంసమే లక్ష్యంగా ఐసిస్(ISIS) వేసిన స్కెచ్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హైదరాబాద్ టు విజయనగరం చేపట్టిన ఆపరేషన్ బ్లాస్ట్ వెలుగు చూడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
కుట్రకు ప్లాన్ చేసిన నిందితుడు సిరాజ్ విజయనగరం (Vizianagaram)లో అరెస్టు అయ్యాడు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌ను హైదరాబాద్ నుంచి విజయనగరం తరలించి, కోర్టు అనుమతితో ఇద్దర్నీ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.
దేశంలో ఎక్కడ ఉగ్రనీడలు బయటపడినా.. దాని లింకులు హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రజాడలపై ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్నాళ్లుగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. సిరాజ్‌పై గత ఆర్నెళ్లుగా డేగ కన్నేసింది.
సిరాజ్, సమీర్ లకు పేలుళ్లపై ఐసిస్ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో ముందుగా డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ వేశారు. ఇందుకోసం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్.. సోషల్ మీడియా ద్వారా బాంబుల తయారీకి సిద్ధమయ్యాడు.
కాగా, పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. సిరాజ్ నుంచి సల్ఫర్(Sulfur), అమ్మోనియా(ammonia), అల్యూమినియం(aluminum) తదితర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు చోట్ల పేలుళ్లకు సౌదీ అరేబియా నుంచి ఐసిస్ కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు.