అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట్‌లో (Somarpet) ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే గ్రామంలో దాడి ఘటన కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) జరగగా ఓ పార్టీ మద్దతుదారుడు ఓడిపోయాడు.
అయితే తాము గెలిచినప్పటికీ ఇబ్బందులు పెట్టాడనే కక్షతో ప్రత్యర్థి వర్గం గ్రామంలోని ఓడిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిపై దాడికి దిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. ట్రాక్టర్‌తో ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లగా బాలరాజు తప్పించుకున్నాడని వారు తెలిపారు.
Yellareddy | నలుగురికి గాయాలు..
ఈ క్రమంలో గంజి భారతి, తోట శారద, బాలమణి, సత్యవ్వకు గాయాలయ్యాయి. వీరిలో గంజి భారతి, తోట శారద పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. బాలమణి, సత్యవ్వలను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో (Yellareddy Government Hospital) చేర్పించారు. రాజకీయ కక్షలతోనే ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Yellareddy | నిజాంసాగర్ రోడ్డుపై రాస్తారాకో..
ఈ క్రమంలో బాధిత వర్గానికి మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) నిజాంసాగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని.. ఆయనను ప్రోత్సహించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్, సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు.
అయితే తమకు న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమించేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా ‘అక్షరటుడే’ (Akshara Today) ప్రతినిధి డీఎస్పీ శ్రీనివాస్ రావుతో మాట్లాడగా గ్రామంలో విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

