అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kotamreddy | ఏపీలోని నెల్లూరు(Nellore)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర పన్నిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.ఎమ్మెల్యే కోటంరెడ్డి(MLA Kotam Reddy) గురించి రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే.. డబ్బు అని ఆ వీడియాలో ఉంది. ఆయనను చంపడానికి కొంతమంది రౌడీ షీటర్లు(Rowdy Sheeters) ప్లాన్ వేసినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం కోటంరెడ్డి ఆఫీస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎస్పీ, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
Kotamreddy | కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
తన హత్యకు పన్నిన కుట్ర వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శనివారం స్పందించారు. తన మిత్రుడు వీడియో పంపడంతో షాక్‌కు గురయ్యానని చెప్పారు. దీనిపై ఎస్పీకి 3 రోజుల ముందే సమాచారం ఉందంటున్నారని, అయితే తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తనను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నారు. తనను చంపితే డబ్బే డబ్బు అని వీడియోలో మాట్లాడారని, ఆ డబ్బు ఎవరు ఇస్తారో పోలీసులు(Police) తేల్చాలని డిమాండ్ చేశారు.
తాను వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్నానని కోటంరెడ్డి అన్నారు. వీడియో బయటకు రాగానే వైసీపీ నేతలు(YSRCP Leaders) ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన తమ్ముడే కుట్ర చేశాడని ఆరోపణలు చేశారన్నారు. అధికారం కోసం సొంత వాళ్లను హతమార్చే డీఎన్ఏ తమది కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఆయన స్పష్టం చేశారు.