అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS Office | భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయంపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఆఫీస్‌లోని ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు.
మణుగూరు (Manuguru)లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం కార్యాలయంలోని బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కార్యకర్తలు చింపేశారు. ఫర్నీచర్‌ను బయట పడేసి నిప్పు పెట్టారు. ఆ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కాంగ్రెస్ రంగులు వేశారు. బీఆర్ఎస్ జెండా, గద్దెను సైతం ధ్వంసం చేశారు.
BRS Office | కాంగ్రెస్ జెండా ఎగురవేత
బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. గతంలో అది కాంగ్రెస్ కార్యాలయమే అని వారు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే తమ కార్యాలయాన్ని ఆక్రమించారని ఆరోపించారు. పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ ఆఫీసును ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘మా కార్యాలయం మాకు కావాలి మాకు కావాలి’ అంటూ ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయంలోని ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత చెలరేగడంతో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
