అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad) చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రెండు దశల్లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
హైదరాబాద్ నగరంలో రద్దీని తగ్గించడంతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కేంద్రం సైతం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నాయి. అయితే రోడ్డు నిర్మాణంలో వేలాది మంది ప్రజలు భూములు కోల్పోతున్నారు. దీంతో సోమవారం ఉదయం వారు హెచ్ఎండీఏ కార్యాలయానికి తరలివచ్చారు.
HMDA | అలైన్‌మెంట్ మార్చాలని..
ఆర్ఆర్ఆర్ కోసం అధికారులు పలుమార్లు సర్వేలు చేపట్టారు. అయితే మొదట ఒక అలైన్‌మెంట్ ప్రకారం రోడ్డు నిర్మించాలని భావించారు. అనంతరం దానిని మార్చారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్‌మెంట్ (Old alignment) ప్రకారం నిర్మాణం చేపడితే ప్రభుత్వ, బీడు భూములు పోతాయని, ప్రస్తుత అలైన్‌మెంట్ ప్రకారం రోడ్డు వేస్తే పట్టా భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే RRR భూములను తక్కువ ధరకు కేటాయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్ మార్చాలని బాధితులు డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయానికి భారీగా బాధితులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ట్రిపుల్ ఆర్ ఎలైన్మెంట్ మార్పు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మారాలంటే.. ఉత్తర భాగంలో సైతం మారాలన్నారు. అలా జరగాలంటే ప్రభుత్వం మారాలేమోనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం జరిగేలా తాను ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కాగా తాజాగా ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్, గట్టుప్పల్ మండల్లాలోని నిర్వాసితులు హెచ్ఎండీఏ కార్యాలయానికి భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.