అక్షరటుడే, వెబ్డెస్క్: VHP Protest | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ (Bangladesh High Commission) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం వద్ద వీహెచ్పీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి.
బంగ్లాదేశ్లో (Bangladesh) ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీపై హత్యతో అక్కడ తీవ్ర హింస చెలరేగింది. దీంతో పలువురు హిందువులపై దాడులు చేశారు. ఓ హిందు వ్యక్తిని కొట్టి చంపారు. దీనిపై భారత్లో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వహిందు పరిషత్ (Vishwa Hindu Parishad) మంగళవారం బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో వీహెచ్పీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడకు వచ్చారు.
VHP Protest | తోపులాట
కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరిగిన దారుణాలపై హిందూ జాగరణ్ మంచ్, వీహెచ్పీ సోమవారం బంగ్లాదేశ్ వీసా దరఖాస్తు కేంద్రం ముందు నిరసన నిర్వహించాయి. దౌత్య ప్రాంగణం వెలుపల నిరసనల మధ్య బంగ్లాదేశ్ న్యూఢిల్లీలోని (New Delhi) తన హైకమిషన్ వద్ద, త్రిపుర, సిలిగురిలోని తన మిషన్లలో వీసా సేవలను నిలిపివేసింది.
VHP Protest | మరో విద్యార్థి నేతపై కాల్పులు
బంగ్లాలో మరో విద్యార్థి నేతపై కాల్పులు చోటు చేసుకున్నాయి. నేషనల్ సిటిజెన్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ మొతాలెబ్ సిక్దర్పై సోమవారం కాల్పులు జరిగాయి. అతడి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఖుల్నా జిల్లాలో సోమవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హింస పెరగడం గమనార్హం. కాగా ఆందోళనలను అణచివేయడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.