అక్షరటుడే, వెబ్డెస్క్ : Kartik Purnima | కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు (special pujas) చేస్తున్నారు.
శివకేశవులకు (Shiva and Keshav) ప్రీతికరమైన కార్తీకమాసంలో పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రోజు ఆలయాలను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో (Yadagirigutta) భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ వేయి స్తంభాల ఆలయంలో సైతం రద్దీ నెలకొంది.
Kartik Purnima | శ్రీశైలంలో..
ఏపీలోని శ్రీశైలం మల్లన్న దర్శనానికి (Srisailam Mallanna Darshanam) భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, పుష్కరిణి హారతి, దశవిధ హారతులు నిర్వహించనున్నారు.
Kartik Purnima | వేములవాడలో..
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి (Vemulawada Rajanna temple) భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన భీమన్న ఆలయంలో సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
