అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telusu Kada Movie Review | సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) హీరోగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. ‘జాక్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ఎలా ఉందనేది చూద్దాం..
Telusu Kada Movie Review | కథ..
వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) అనాథ అయినా తన కష్టంతో ఎదిగిన వ్యక్తి. జీవితంలో ప్రేమించే భార్య, పిల్లలతో సంతోషంగా ఉండాలన్నది అతని కల. కానీ అతని ప్రేయసి రాగా (శ్రీనిధి శెట్టి) మాత్రం సంబంధాలకు పేరు, నిర్వచనం అవసరం లేదని, పెళ్లి అనే బంధంలో విశ్వాసం లేదని నమ్ముతుంది. ఈ భిన్న ఆలోచనల వల్ల ఇద్దరూ విడిపోతారు. తరువాత వరుణ్ అంజలిని (రాశీఖన్నా) వివాహం చేసుకుంటాడు. కానీ వీరిద్దరికీ బయాలజికల్‌గా పిల్లలు పుట్టరు అని తెలిసి షాక్ అవుతారు. ఆ సమయంలో తిరిగి రాగా జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ ముగ్గురి జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? అంజలి తీసుకున్న నిర్ణయం వారిమధ్య ఎలాంటి ప్రభావం చూపింది? అనేదే కథ.
Telusu Kada Movie Review | నటీనటుల పర్ఫార్మెన్స్..
సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈసారి “టిల్లూ” ఇమేజ్ నుంచి బయటపడేందుకు చేసిన కృషి స్పష్టంగా కనిపించింది. రాశీఖన్నా (Raashi Khanna) అంజలి పాత్రలో నాజూకుగా, భావోద్వేగంగా కనిపించింది. ఆమె కెమిస్ట్రీ సిద్ధుతో బాగా వర్క్ అయింది. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్‌లో వారి మధ్య ఉన్న సంభాషణ సన్నివేశాలు బాగున్నాయి. శ్రీనిధి శెట్టి (Heroine Srinidhi Shetty) రాగా పాత్రలో బలమైన రోల్‌ను సొంతం చేసుకుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆమె నటన అద్భుతం. హర్ష కెముడు ఫ్రెండ్ పాత్రలో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడు. అన్నపూర్ణమ్మ క్లైమాక్స్‌లో హృదయాన్ని తాకే సన్నివేశాలలో తనదైన నటనతో అలరించింది.
Telusu Kada Movie Review | టెక్నికల్ విశ్లేషణ
థమన్ ఇచ్చిన రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్‌పై మరింత అందంగా కనిపించాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో రొమాంటిక్ డ్రామాకి ‘హీరో ఎలివేషన్ BGM’ అనవసరంగా అనిపించింది. సినిమాటోగ్రాఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్ విజువల్స్ అద్భుతం. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆయన కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నూలి పనితనం బాగుంది కానీ కొంత కత్తిరించాల్సిన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం అత్యుత్తమం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాణ్యతపై ఎటువంటి రాజీ పడలేదని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
- థమన్ సంగీతం & రెండు చార్ట్‌బస్టర్ పాటలు
- ప్రధాన నటుల నటన
- కొత్త కాన్సెప్ట్
- హ్యూమన్ ఎమోషన్స్ & కొన్ని బ్యూటిఫుల్ మోమెంట్స్
మైనస్ పాయింట్స్:
- కొన్ని డైలాగులు
- స్లో పేస్ , రిపిటేటివ్ సీక్వెన్స్‌లు
- అనవసర హీరో ఎలివేషన్ షాట్లు
తారాగణం : సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష కెముడు, రోహిణి, సంజయ్ స్వరూప్, అన్నపూర్ణమ్మ మరియు ఇతరులు
దర్శకత్వం : నీరజా కోనా
నిర్మాతలు : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కుచిభోట్ల
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం : థమన్ ఎస్
విశ్లేషణ..
ప్రస్తుత తరం సంబంధాలపై ఉన్న గందరగోళం, స్వేచ్ఛ, భావోద్వేగాలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసింది దర్శకురాలు నీరజా కోనా. సాంప్రదాయ బంధాలకు దూరంగా, ఆధునిక దృష్టితో తీసిన ఈ ప్రేమకథ యూత్, అర్బన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. వరుణ్–అంజలి ఫస్ట్ మీటింగ్, బేబీ షవర్ సీన్‌లో పసుపు అప్లై చేసే సన్నివేశం, ముగ్గురి మధ్య ఉన్న ఫన్ మోమెంట్స్, అన్నపూర్ణమ్మ సన్నివేశం వంటి కొన్ని భాగాలు హైలైట్‌గా నిలిచాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, కొంత స్లో పేస్, హీరో ఎలివేషన్ షాట్లు నిరాశపరిచాయి. ‘తెలుసు కదా’ .. భావోద్వేగాలతో నిండిన ఆధునిక ప్రేమ కథ. నీరజా కోనా దర్శకురాలిగా ఈ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆమె చేసిన ఈ సినిమా ఎక్కువగా పట్టణ ప్రేక్షకులకే నచ్చే అవకాశం ఉంది. భావోద్వేగాలపై ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఈ చిత్రం నచ్చుతుంది.
రేటింగ్ : (3/5)