అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor Sales | మద్యం వినియోగంలో రాష్ట్రం దక్షిణాదిలోనే టాప్లో నిలిచింది. తెలంగాణ (Telangana)లో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉంది.
రాష్ట్రంలో శుభకార్యాలు, అశుభ కార్యాల్లో సైతం మద్యం వినియోగించడం ఆనవాయితీగా మారింది. పండుగలు, ఇతర కార్యక్రమాల్లో గతంలో కల్లు వినియోగించేవారు. అయితే ప్రస్తుతం మద్యం వినియోగిస్తుండటంతో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అనాదిగా తెలంగాణలో మాంసం, మందు వినియోగం అధికంగానే ఉంటుంది. ఇంటికి బంధువులు వచ్చినా ప్రస్తుత రోజుల్లో మద్యం తీసుకువస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరుతోంది.
Liquor Sales | దక్షిణాదిలో..
సౌత్ ఇండియా (South India)లో మద్యం వినియోగం, దాని ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగిపోతున్నాయి. మద్యం ఆదాయంలో రాష్ట్రం టాప్లో ఉంది. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ తాజాగా వివరాలు వెల్లడించింది. తెలంగాణలో తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. తర్వాత స్థానాల్లో కర్ణాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు),ఆంధ్రప్రదేశ్ (2.71 లీటర్లు), కేరళ (2.53 లీటర్లు) ఉన్నాయి. తెలంగాణలో మద్యంపై తలసరి ఖర్చు రూ.11,351 కాగా, ఏపీలో రూ.6,399గా ఉంది. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) ఏటా రూ. 36,000 కోట్ల ఆదాయం వస్తుంది.
Liquor Sales | భారీగా దుకాణాలు
తెలంగాణలో మద్యం వినియోగాన్ని ఓ రకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైన్ షాపుల (Wine Shops) ఏర్పాటుకు అనుమతులు ఇస్తోంది. విపరీతంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రతిగ్రామంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అక్రమంగా బెల్ట్ షాపులు నడుస్తున్నా.. మద్యంతో ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతుండటంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి బానిసలుగా మారి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసలు మారుతున్నారు.