అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Sridhar Babu | రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణ రాజధానిగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. బిట్స్ పిలాని (BITS Pilani) హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన బిట్స్ పూర్వ విద్యార్థుల సంఘం గ్లోబల్ మీట్ 2026 (Global Meet 2026)లో ఆయన మాట్లాడారు.
టెక్నాలజీని విద్యా డిగ్రీలకే పరిమితం చేయకూడదని, జాతీయ సేవ, ఆత్మనిర్భర్ భారత్ పెద్ద లక్ష్యం కోసం అర్థవంతంగా ఉపయోగించాలని అన్నారు. గ్లోబల్ డిజిటల్ మోడళ్లతో పోలికను చూపుతూ, అనేక దేశాలు ప్రైవేట్ డిజిటల్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించినప్పటికీ, ఆధార్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే మొట్టమొదటి AI-ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్ సెంటర్ను తెలంగాణలో ప్రారంభించామని తెలిపారు.
Minister Sridhar Babu | ఏఐ యూనివర్సిటీతో..
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న AI ఇన్నోవేషన్ హబ్, AI విశ్వవిద్యాలయం, కొత్త ప్రమాణాలను నిర్దేశించగలవని మంత్రి పేర్కొన్నారు. డేటా గోప్యత, బాధ్యతాయుతమైన ఏఐకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగాలు కోడింగ్ నైపుణ్యంపై పరిమితం కావన్నారు. మూల సమస్యలను గుర్తించి పరిష్కారాలను అందించగల సృజనాత్మక ఆలోచనాపరులకు ఎక్కువ విలువ ఉంటుందన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణలో గ్రామీణ సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐని వినియోగించాలని సూచించారు.