అక్షరటుడే, హైదరాబాద్: Telangana Sports Hub : ఖేలో ఇండియా (Khelo India), కామన్ వెల్త్ (Commonwealth), ఒలింపిక్స్(Olympics).. క్రీడాపోటీలు ఏవైనా వాటిలో రాష్ట్రానికి అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానించింది.
రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు చేయాలనే బోర్డు తీర్మానాలను ఆమోదించింది.
హైదరాబాద్‌లో (ఆగస్టు 28) జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు.
Telangana Sports Hub : ఐటీ తరహాలో క్రీడా సంస్కృతి..
తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
ఈ తరహాలోనే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలషిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గతంతో పోల్చితే 16 రెట్లు బడ్జెట్ పెంచామని చెప్పారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
క్రీడా రంగ ప్రాధాన్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.
క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ సమావేశంలో స్పోర్ట్ హబ్ ఛైర్మన్, ఆర్ పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka), హబ్ కో-ఛైర్ పర్సన్ ఉపాసన కొణిదెల (Upasana Konidela) , సభ్యులు, ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) , ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా (Abhinav Bindra) , ధాని ఫౌండేషన్ వీతా ధాని (Vita Dani) , బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) , విశ్వ సముద్ర ఫౌండేషన్ చింతా శశిధర్ (Chinta Shashidhar) , క్రీడా నిర్వాహకులు బియ్యాల పాపారావు (Papa Rao Biyyala) , ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (Bhaichung Bhutia) , ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి (Ravikanth Reddy) , ఏఐపీఎస్ – ఏసియా వైఎస్ ప్రెసిడెంట్ సబా నాయకన్ (Saba Nayakan) క్రీడాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.
Telangana Sports Hub : క్రీడా పోటీల విధానంలో మార్పు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఇప్పటి వరకు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు.
శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామని సీఎం తెలిపారు.
క్రీడా సామగ్రిపై ఉన్న పన్నుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని సీఎం చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అవసరమైన ప్రోత్సాహాకాలు అందిస్తామని తెలిపారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్టేడియాలు పెద్ద సంఖ్యలో ఉన్నా.. తగిన సంఖ్యలో కోచ్‌లు లేరని ఈ సందర్బంగా సీఎం గుర్తుచేశారు. ఉన్న కోచ్‌లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు.
రానున్న మూడేళ్లలో మనం సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాల దేవి పాల్గొన్నారు.