అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranthi Holidays | తెలంగాణ (Telangana)లోని పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ మరింత ఆనందాన్ని తీసుకురానుంది. ప్రభుత్వం తొలుత ప్రకటించిన ఐదు రోజుల సెలవులను సవరిస్తూ, ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇచ్చే దిశగా విద్యాశాఖ (Education Department) కసరత్తు చేస్తోంది.
గత మే నెలలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజులు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి 10వ తేదీ రెండో శనివారం కావడంతో ఆ రోజున ఇప్పటికే పాఠశాలలకు సెలవు ఉంటుంది. అంతేకాదు, జనవరి 11 ఆదివారం కావడం వల్ల సెలవులు స్వయంచాలకంగా ఒక రోజు ముందే ప్రారంభం కానున్నాయి.
Sankranthi Holidays | త్వరలోనే ప్రకటన..
మరోవైపు ప్రభుత్వం జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను అధికారిక సెలవులుగా ప్రకటించడంతో, మొత్తం సెలవుల కాలాన్ని పునఃసమీక్షించాల్సి వచ్చింది. విద్యాశాఖలో ప్రస్తుతం చర్చ జరుగుతున్న ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం జనవరి 10న రెండో శనివారం సెలవు, 11న ఆదివారం సాధారణ సెలవు, 12 నుంచి 16 వరకు సంక్రాంతి పండుగ సెలవులు అమల్లోకి రానున్నాయి. ఈ లెక్కన పాఠశాలలు తిరిగి జనవరి 17న ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిపాదనపై ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే జనవరి 17 కూడా శనివారం కావడంతో, ఆ రోజున కూడా సెలవు ప్రకటిస్తే పాఠశాలలు తిరిగి జనవరి 19న తెరుచుకునే అవకాశం ఉంది. అలా జరిగితే విద్యార్థులకు వరుసగా తొమ్మిది రోజులపాటు సెలవులు దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు సెలవులు పెరిగే సూచనలు కనిపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొంది. అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అందరి దృష్టి విద్యాశాఖపై కేంద్రీకృతమైంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం (AP Government) విద్యార్థులకు జనవరి 10 నుంచి జనవరి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించిన విషయం విదితమే.