అక్షరటుడే, హైదరాబాద్: Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపుతోంది. గవర్నర్ నివాసం(Governor’s residence) మొదటి అంతస్తులోని సుధర్మ భవన్(Sudharma Bhavan)లో హార్డ్‌డిస్క్‌లు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల(CCTV cameras) ఆధారంగా చోరీ జరిగినట్లు నిర్ధారించిన రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ఘటన ఈ నెల (మే) 14న జరిగినట్లు తెలిసింది.
హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి కంప్యూటర్ గదిలోకి వెళ్లి హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వాటిల్లో రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన నివేదికలు ఉన్నట్లు తెలిసింది. కట్టుదిట్టమైన భద్రతలో ఉండే రాజ్ భవన్లో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు(Panjagutta police) దర్యాప్తు తీవ్రతరం చేశారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గుర్తించారు. హార్డ్‌డిస్క్‌లు ఎందుకు ఎత్తుకెళ్లాడు? ఎవరు చేయమన్నారు? వాటిలోని సమాచారాన్ని దుర్వినియోగం చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Telangana Raj Bhavan | రాజ్‌భవన్‌కే రక్షణేది?
గవర్నర్ నివాసానికే రక్షణ లేకుండా పోవడం, సాక్షాత్తు రాజ్‌భవన్‌లో చోరీ జరుగడం ప్రస్తుతం రాష్ట్రం సంచలనం సృష్టించింది. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది. రాజ్‌భవన్‌లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్‌డిస్క్‌ల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ డేటాను తస్కరించడం ద్వారా ప్రభుత్వ భద్రతా వైఫల్యం మరోమారు బయటపడింది. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసానికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
