అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
అకాల వర్షాలు ప్రారంభం కానున్నాయి. వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత తెలంగాణలో వర్షాలు లేవు. అయితే ప్రస్తుతం ఉపరిత ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతారు. రాత్రి వేళ వికారాబాద్ (Vikarabad), సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చిరుజల్లులు, పొడి వాతావరణం ఉంటుంది.
Telangana Rain Alert | ఎల్లో అలెర్ట్..
మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad) లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. దీంతో పంటలకు నీరు అందడం లేదు. ఈ దశలో చిరుజల్లులు కురిసినా పంటలకు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. కాగా తెలంగాణ 18 జిల్లాల్లో ఉరుములతో కూడిన వాన పడుతుందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో సైతం వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. గోదావరి జిల్లాలతో పాటు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
