అక్షరటుడే, హైదరాబాద్: Telangana Municipal Elections | తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవగా.. కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా జిల్లాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించారు. కాగా, 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు, అధికారులు గుర్తించారు. వీటికితోడు 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా పేర్కొంటూ బలగాలను మోహరించారు.
Telangana Municipal Elections | వెబ్ కాస్టింగ్ నిఘా..
పోలింగ్లో పారదర్శకత ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ కొనసాగుతోంది. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లోపలతోపాటు బయట సైతం కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
పటిష్టమైన భద్రత కోసం దాదాపు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఇందులో టీజీఎస్పీతో పాటు ఎక్సైజ్ Excise, అటవీ Forest, సీఐడీ CID, లీగల్ మెట్రాలజీ , Legal Metrology విభాగాల సిబ్బంది ఉండటం గమనార్హం.