అక్షరటుడే, వెబ్‌డెస్క్: Banakacherla Project | ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై (Banakacharla project) తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌తో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ క్రమంలో ఇటీవల బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
మిగులు జలాలతో ప్రాజెక్ట్ కడితే తెలంగాణకు అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వృథాగా పోతున్న నీటినే తాము వాడుకుంటామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు (Kaleshwaram project) అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. లోకేశ్ వ్యాఖ్యలకు ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు.
Banakacherla Project | చుక్క నీటిని కూడా వదులుకోం
ఏపీ మంత్రి లోకేశ్నికర, మిగులు, వరద జలాల గురించి తెలుసుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయితే వరద జలాలు లెక్కలోకి వస్తాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేశ్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు.
Banakacherla Project | బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం
బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలన్నారు. ఏపీ మంత్రుల ప్రకటనలను పట్టించుకోబోమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సైతం శనివారం లోకేశ్ వ్యాఖ్యలను ఖండించారు. తప్పుదారి పట్టించేలా లోకేశ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ అవసరాలు పూర్తయిన తర్వాతే బనకచర్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.