అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cough Syrup | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కల్తీ దగ్గు మందు తాగి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 16 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రెండు దగ్గు మందు (Cough Syrup)లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్రిఫ్ సిరప్ కారణంగా 16 పిల్లలు చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం(State Government) అప్రమత్తం అయింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నకిలీ దగ్గు మందులను నిషేధిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Cough Syrup | కల్తీ జరిగినట్లు గుర్తింపు
రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందుల్లో కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటిని విక్రయించొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా చిన్నారుల మృతికి కారణమైన కోల్డ్రిఫ్ సిరప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సైతం దానిపై గతంలోనే నిషేధం విధించింది. కేరళలో సైతం ఆ సిరప్ అమ్మకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కాగా దగ్గు మందుతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెండేళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో దీనిని వేయొద్దని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.