అక్షరటుడే, వెబ్‌డెస్క్: Accreditation card | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్ట్‌లకు నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం జీవో (Government Order) విడుదల చేసింది.
వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు (accreditation cards) జారీ చేస్తుంది. అక్రిడిటేషన్ కార్డుల కోసం 2015లో తెచ్చిన నిబంధనలు ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీవో విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు ఉంటాయి. వీటి కాలపరిమితి రెండేళ్లు. ఆయా కమిటీలకు అర్హులను గుర్తించి కార్డులు అందిస్తాయి. జిల్లా కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
Accreditation card | వేర్వేరుగా..
బీఆర్ఎస్ హయాంలో తొలిసారి డెస్క్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు (reporters and desk journalists) వేర్వేరుగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వనుంది. అలాగే డెస్క్ జర్నలిస్ట్‌లకు మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు (government welfare schemes) పొందేందేకు ఈ కార్డులు ఉపయోగపడుతాయి.
Accreditation card | డిజిటల్ మీడియాకు నిబంధనలు
డిజిటల్ మీడియాకు కూడా కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే పలు నిబంధనలు విధించింది. సదరు వెబ్‌సైట్‌కు ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ ఉంటేనే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే ఈ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 10 కార్డులు మాత్రమే ఇవ్వనున్నారు.
Accreditation card | అర్హతలు..
కనీసం 2 వేల సర్యులేషన్ ఉన్న పేపర్ల మాత్రమే అక్రెడిటేషన్‌కు అర్హత పొందుతాయి. PRGI రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. 75 వేల కంటే ఎక్కువ సర్కులేషన్ ఉంటే పెద్ద పత్రికగా గుర్తిస్తారు. 25 వేల నుంచి 75 వేల సర్కులేషన్ ఉంటే మీడియం డైలీ, 2 వేల నుంచి 25 వేల వరకు ఉంటే చిన్న పత్రికలుగా పరిగణిస్తారు. శాటిలైట్ ఛానెళ్లు (Satellite channels) 50 శాతం వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేస్తేనే అక్రిడిటేషన్ కార్డులకు అర్హత ఉంటుంది.
Accreditation card | జర్నలిస్ట్‌లకు..
స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి. నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి. 15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Accreditation card | దరఖాస్తులు ఎప్పుడో..
బీఆర్ఎస్ హయాంలో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారు. 2022లో చివరగా కార్డులు ఇచ్చారు. వాటి గడువు 2024 జూన్‌తో ముగిసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్డుల గడువును ప్రతి మూడు నెలలకు ఒకసారి పెంచుతూ వస్తోంది. దీంతో కొత్త కార్డుల కోసం జర్నలిస్ట్‌లు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.