అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | తెలంగాణలో నిర్వహించిన కులగణన (Caste Census) దేశానికే రోల్ మోడల్ అని లోక్‌సభ ప్రతిపక్ష నేత (LOP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కుల గణన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తానే పుష్ చేశానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇందిరా భవన్లో (Indira Bhavan) ఇండియా కూటమి నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. కులగణన నిర్వహించడం అంత తేలిక కాదని ఆయన పేర్కొన్నారు. రేవంత్, కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ఆయన కొనియాడారు. ఇంటింటికి వెళ్లి 56 ప్రశ్నలతో సర్వే చేశారన్నారు. సరైన డేటా చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ చేతిలో సరైన డేటా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
Rahul Gandhi | రేర్ మోడల్ అని పిలవండి
తెలంగాణ చేపట్టిన కులగణనను తెలంగాణ మోడల్ అని పిలవడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే రేర్(RARE) మోడల్ అని పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేర్ అంటే ఏమిటో తాను తర్వాత చెబుతా అన్నారు. మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని.. లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజల కోరికలను రాహుల్ తెలుసుకున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ కులగణనపై హామీ ఇచ్చారన్నారు. దేశానికి దిశను చూపించే విధంగా కులగణన చేపట్టామని ఆయన తెలిపారు. కులగణనపై సోనియా గాంధీ (Sonia Gandhi) తనను మెచ్చుకుంటూ లేఖ రాసిందని సీఎం తెలిపారు. అది తనకు ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అని చెప్పారు. కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనలేదని సీఎం పేర్కొన్నారు. అందుకే వారిని తెలంగాణ లెక్కల్లోంచి తీసేశామన్నారు.
తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా సర్వే చేపట్టామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.