అక్షరటుడే, హైదరాబాద్: Telangana Assembly | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర జల వివాదాలన్ని పరిష్కారం చేసే వరకు, ఏపీలో చేపట్టబోతున్న పోలవరం – నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు, పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుతోపాటు ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
Telangana Assembly | జల వివాదంపై వివరణ..
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ కొనసాగింది. చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవివరంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు, రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన జల వివాదాలతోపాటు గత ప్రభుత్వ నిర్ణయాలు, తప్పిదాలు, ప్రాజెక్టుల చారిత్రక క్రమాన్ని సమగ్రంగా సభ ఎదుట ఉంచారు.
తొలుత స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ.. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం – పూర్వాపరాలపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు, గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి ఏ ఇతర రూపంలోనైనా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రతిపాదించారు.
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీవ్ర కరవు ప్రాంతం. అత్యధికంగా వలసలకు గురైన ప్రాంతం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఆనాటి ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టిందని తీర్మానంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో సరైన రీతిలో పురోగతి సాధించలేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకుని పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (90 టీఎంసీలతో తాగునీటి, సాగునీటి కోసం) కు సంబంధించిన అన్ని అనుమతులు సత్వరమే ఇవ్వాలని.. శాసనసభ చేసిన తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.