అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana GST Scam | తెలంగాణలో అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగంపై జరుగుతున్న భారీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Directorate General of GST Intelligence (డీజీజీఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ (Hyderabad Zonal Unit) చేపట్టిన ఆపరేషన్‌లో సుమారు రూ.13,000 కోట్ల విలువైన జీఎస్టీ మోసం బయటపడింది.
ఈ కేసులో డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ సేవలందిస్తున్న యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు.
Telangana GST Scam | నకిలీ కేవైసీతో షెల్ కంపెనీల వల
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. అక్రమ ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) వెబ్సైట్ల నిర్వహణకు అనుబంధ ఫిన్‌టెక్ సంస్థలు, చెల్లింపు అగ్రిగేటర్లు, థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్లు సహకరించినట్లు తెలిసింది. షెల్ కంపెనీల పేరుతో నకిలీ కేవైసీ పత్రాలు సృష్టించి, వాటిని గేమింగ్ వెబ్సైట్లకు అనుసంధానం చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడమే కాకుండా, అక్కడి నుంచి వచ్చే భారీ నగదు ప్రవాహాన్ని వందలాది షెల్ కంపెనీల యూపీఐ ఐడీల ద్వారా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్వేలు, యూపీఐ ఇంటిగ్రేషన్ (UPI Integration)లను అక్రమంగా వినియోగించి ఈ లావాదేవీలు నిర్వహించినిట్లుగా తెలుస్తోంది.
వ్యాపారులు మరియు షెల్ సంస్థలకు మోసపూరిత కేవైసీ ధ్రువీకరణలు కల్పించడంలో పంకజ్ కుమార్ కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ కార్యకలాపాలకు అవసరమైన యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చడంలో ఆయన సహకరించినట్టు ఆధారాలు లభించాయి. అక్రమ గేమింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంలో లబ్ధిదారులలో పంకజ్ కుమార్ కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దాడుల్లో భాగంగా యాడ్సన్ సంస్థకు సంబంధించిన సుమారు రూ.100 కోట్ల వరకు నగదు ఉన్న బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ సిండికేట్ 2025 నాటికి సుమారు 23 బిలియన్ డాలర్ల స్థూల లావాదేవీల విలువను నమోదు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
డీజీజీఐ అధికారులు (DGGI Officers) వివిధ బ్యాంకు ఖాతాల్లోని నిధుల మార్పిడిని సవివరంగా విశ్లేషిస్తున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి ఉన్న ఇతర అనుబంధ ఫిన్‌టెక్ సంస్థలు, సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది. డిజిటల్ మనీ ట్రయల్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న భారీ ఆర్థిక మోసాలపై ఇది పెద్ద ఆపరేషన్‌గా భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించిన ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.