అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tejaswi Yadav | ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వైశాలి జిల్లా ప్రధాన కార్యాలయం అయిన హాజీపూర్‌లోని కలెక్టరేట్లో (Hajipur Collectorate) ఆర్జేడీ చీఫ్, తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవి సమక్షంలో 35 ఏళ్ల తేజస్వి యాదవ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలుకు ముందు అతడు భారీ రోడ్ షో నిర్వహించారు. మరోసారి రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ దిగుతున్న ఆయన.. హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా బీహార్ సంపన్నంగా మారాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Tejaswi Yadav | ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం
బీహార్ నుంచి నిరుద్యోగాన్ని తరిమి వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఇస్తామని తేజస్వి పునరుద్ఘాటించారు. “రాఘోపూర్ ప్రజలు నాపై రెండుసార్లు నమ్మకం ఉంచారు. ఈసారి కూడా నేను రాఘోపూర్ (Raghopur) నుంచి నామినేషన్ దాఖలు చేశా. బీహార్‌లోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని మేము సంకల్పించుకున్నాం. బీహార్ నుండి నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. మనం బీహార్‌ను ముందుకు తీసుకెళ్లాలి. మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బీహార్ (Bihar) సంపన్నంగా మారాలని కూడా కోరుకుంటున్నాం. నేను రెండు స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తానని కొంతమంది ప్రచారం చేశారు. కానీ ఈ తేజస్వి యాదవ్ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తున్నాడని” ఆయన అన్నారు.
Tejaswi Yadav | బీజేపీ అమ్ముడుపోయిన జేడీయూ..
అధికార పార్టీ జేడీయూ బీజేపీకి అమ్ముడుపోయిందని తేజస్వి (Tejaswi Yadav) ఆరోపించారు. జేడీయూను పేరుకే నితీశ్ కుమార్ నడుపుతున్నాడన్నారు. వాస్తవానికి పార్టీని నడుపుతున్నది లాలన్ సింగ్, సంజయ్ ఝా, విజయ్ చౌదరి అని తెలిపారు. ఈ ముగ్గురు బీజేపీకి అమ్ముడుపోయారని, నితీశ్ కుమార్‌ను నాశనం చేశారని ఆరోపించారు. త్వరలోనే జేడీయూ నితీష్ కుమార్‌తో ఉండదన్నారు.