అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో విపక్ష కూటమి తన సీఎం అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలు కలిపి బీహార్‌లో మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) కూటమి పేరిట పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) పేరును కూటమి నేతలు ప్రకటించారు.
బీహార్ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్డీఏ (NDA) కూటమి తన సీఎం అభ్యర్థిగా మరోసారి నితీశ్‌కుమార్‌ను ప్రకటించింది. 12 స్థానాల్లో మహాగఠ్బందన్లోని పార్టీలు పరస్పరం పోటీ చేస్తున్నాయి. దీంతో కూటమిలో లుకలుకలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ గురువారం ఆర్జేడీ చీఫ్ లాల్ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సమావేశం అయ్యారు. అనంతరం సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరును అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
Bihar Elections | ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా..
తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాము నిర్ణయించామని గెహ్లాట్ గురువారం హోటల్ మౌర్యలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా మహాగఠ్‌బంధన్‌లోని ఏడు పార్టీలు ఆర్జేడీ నేత తేజస్వి నాయకత్వాన్ని ఆమోదించడానికి అంగీకరించాయి.
Bihar Elections | కమీషన్ల పాలన
తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అవినీతి, శాంతిభద్రతల విషయంలో తాను రాజీపడనని ఆయన పేర్కొన్నారు. బీహార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
